స్వార్ధపరుడు
చందమామ కొనగానే మొదట చదివేది విక్రమార్కుడి బేతాళ కథే.ఇది కూడ వారు ప్రచురించిన కథే... నేను కేవలం సేకరించి ఇక్కడ ఉంచాను . పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో, అర్ధరాత్రివేళ ఎన్నో ఇక్కట్లకోర్చిన తర్వాత, నీ ప్రయత్నం ఫలించినా, నువ్వెవరికోసమైతే ఇన్ని కఠోర శ్రమలకోర్చావో, ఆ వ్వక్తి కేవలం స్వార్థపరుడూ, భోగలాలసుడూ అని తెలుసుకుని నువ్వు నిరాశకు గురయ్యే అవకాశం వుంది. ఇందుకు ఉదాహారణగా, సుఖభోగాలకు అలవాటుపడి స్వార్థపరుడుగా మారిపోయిన స్పందనదాసు అనే ఒక కవి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను," అంటూ ఇలా చెప్పసాగాడు: దుర్గాపురం అనే గ్రామంలో స్పందనదాసు అనే ఒక యువకుడుండేవాడు. అతడు చెట్టూ పుట్టా, రాయీ రప్పా, మనిషీ-మృగం-ఒకటేమిటి, దేనిమీదనైనాసరే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటంత వీనులవిందుగా గొప్ప కవిత్వం చెప్పేవాడు. దుర్గాపురంలో పేదా గొప్పా, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కడూ స్పందనదాసు కవిత్వాన్ని ఆనందంతో తన్మయులౌతూ వినేవారు. తృణమో పణమో క...