సుమతీ శతకం

చిన్నప్పుడు పద్యాలు బాగా చెప్పేదాన్ని,బళ్ళో చేరక ముందునుంచే,అమ్మ పద్యాలు నేర్పించడం నాకు బాగా గుర్తు ...ఇప్పుడు ఆ రోజులు తల్చుకుంటే మన తర్వాత తరం వాళ్ళు చాలా మిస్సవ్వబోతున్నారనిపిస్తుంది, కొన్ని పద్యాలు గుర్తు చేసుకుందామా,...పద్యాలు మాత్రమేకాదు అప్పటి జ్ఞాపకాలు కూడా తప్పకుండా గుర్తొస్తాయి.

****************************************

ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్
నొప్పించక తానొవ్వక
తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ !

****************************************

పుత్రోత్సాహము తండ్రికి
బుత్రుఁడు జన్మించినపుడే పుట్టదు జను లా
పుత్రునిఁ గనుఁగొని పొగడఁగఁ
బుత్రోత్సాహంబు నాడు పొందు ర సుమతీ !

****************************************

సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొఱకే
పెరుఁగుట విరుఁగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చుట కొఱకె తథ్యము సుమతీ !

****************************************

ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగ జెఱువు నిండినఁ
గప్పలు పదివేలు చేరుఁగదరా సుమతీ !

***************************************

ఎప్పుడుఁ దప్పులు వెదకెడు
నప్పురుషునిఁ గొల్వకూడదది యెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ

***************************************

అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని మోహరమునఁ దా
నెక్కినఁ బాలుని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ !

***************************************

కనకపు సింహాసనమున
శునకముఁ గూర్చుండబెట్టీ శుభ లగ్నమునం
దొనరగఁ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ !

***************************************

కూరిమి గల దినములలో
నేరములెన్నఁడు గలుగనేరవు
మఱియా కూరిమి విరసంబైనను
నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ !

***************************************

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుడు దగన్,
హేమంబుఁ గూడబెట్టిన
భూమీశుల పాలఁ జేరు భువిలో సుమతీ !

***************************************

లావుగలవానికంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుఁడు
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ !

***************************************

వినఁదగునెవ్వరు సెప్పిన
వినినంతనె వేగపడక వివరింపఁదగున్
కనికల్ల నిజముఁ తెలిసిన
మనుజుఁడెపో నీతిపరుఁడు మహిలో సుమతీ !

***************************************

Comments

Anonymous said…
mi sumati satakala collection bagundi kani aneka mandi sataka lanu marichi poyaru vatinikuda petandi vemana,bathuhari modalagunavi
ante kakunda yandamuri virendra nadh prati heading munduna oka manchi vkyam untundi vatini kuda jata pariste mi teluginti chandamama vennelalo teluginti chandamama laga untundi
చందమామగారు... మంచి ప్రయత్నం శతకాల పద్యాలు వ్రాయటం..
నాకు గుర్తు ఎండాకాలం సెలవుల్లో రోజుకొక పద్యం అప్పచెబితేకానీ మా అమ్మ క్రికెట్ ఆడుకోవటానికి పంపించేది కాదు... మీకు వీలు దొరికినప్పుడల్లా వ్రాయండి..

Popular posts from this blog

మరికొన్ని సుమతీ శతక పద్యాలు ...

బుడుగు-చిచ్చుల పిడుగు

స్వార్ధపరుడు